నిజామాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. సొంత అన్న భార్యపైన(వదిన) పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. ఇలా తోడబుట్టిన వాడి సంసారంలో  నిప్పులు పోయడమే కాదు...సాటి మహిళను వేధింపులకు గురిచేసి సదరు యువతి రాక్షసానందాన్ని  పొందింది. చివరకు ధైర్యం చేసిన వివాహిత తన వ్యక్తిగత ఫోటోలతో వేధిస్తున్న యువకున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో ఈ ఉదంతం మొత్తం బయటకు వచ్చింది. 

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన ఓ వివాహితకు భర్త చెల్లితో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో వదినపై ద్వేషాన్ని పెంచుకున్న మరదలు బంధుత్వానికి విలువనివ్వక పోగా సాటి మహిళ అన్న జాలికూడా  లేకుండా దారుణానికి  పాల్పడింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి వదినచేత తాగించి సృహకోల్పోయాక నీచమైన పనికి పూనుకుంది. 

వేరే యువకుడి సాయంతో వారిద్దరు కలిసున్నట్లుగా అసభ్యకర రీతిలో  ఫోటోలు తీసింది. ఆ తర్వాత ఆ ఫోటోల సాయంతో ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించింది. అంతేకాకుండా సదరు యువకుడు వివాహితను లైంగికంగా వేధించసాగాడు. ఇలా వారిద్దరి ఆగడాలు మరీ శృతిమించి వివాహిత కాపురాన్ని కూల్చాయి. 

దీంతో బాధిత మహిళ భర్తకు దూరంగా తన తల్లిగారింట్లో వుంటోంది. అయితే అక్కడ కూడా ఆమెనే ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా సదరు యువకుడు తన కోరిక  తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఇక ఈ ఆగడాలను ఏమాత్రం తట్టుకోలేకపోయిన ఆమె తన సోదరి సాయంతో  యువకున్ని పట్టుకుని చితకబాదింది. అతన్ని పోలీసులకు అప్పగించి తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది. 

దీంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడికి వివాహిత సహకరించినట్లు  తేలితే ఆమెపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఆ విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని  వెల్లడించారు.