హైదరాబాద్‌  కొండాపూర్‌లో యువతిపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

హైదరాబాద్‌ కొండాపూర్‌లో యువతిపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. గాయత్రి పక్కా ప్లాన్ ప్రకారమే బాధితురాలిపై దాడి చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. సంతానం కలగడం లేదని కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్న గాయత్రి.. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆన్‌లైన్ డ్రైవర్స్ అనే వెబ్‌సైటులో డ్రైవర్లను బుక్ చేసుకునేది. ఆమెను తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చిన డ్రైవర్లు మనోజ్, విష్ణువర్దన్‌లకు యువతిని వేధించే ప్లాన్ చెప్పింది. విషయాన్ని మనోజ్ మరో ఆటో డ్రైవర్‌కు చెప్పగా.. ఆ ముగ్గురితో పాటు, ఆ ఇంట్లో అద్దెకు ఉండే మస్తాన్‌కు గాయత్రి ప్లాన్‌ను వివరించింది. మస్తాన్ అతడి స్నేహితుడు ముజాహుద్దీన్‌ను కూడా గాయత్రి ఇంటికి రప్పించాడు. 

పథకం ప్రకారం ఐదుగురిని ముందుగానే ఇంట్లో ఉంచిన గాయత్రి.. బాధితురాలు తన ఇంటి వద్దకు వచ్చేలా చేసింది. బాధితురాలి తల్లిదండ్రులను బయటే ఉంచి.. ఆమెను మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లింది. అక్కడ నలుగురు నిందితులు బాధితురాలు కాళ్లు, చేతులు కట్టేయగా.. మరో నిందితుడు దస్తులు తొలగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలుపై దాడి చేసిన గాయత్రి ఆమెను తిడుతూ వీడియోను చిత్రీకరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడింది. 

ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో శ్రీకాంత్ లేడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అతని పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక, ఈ కేసుకు సంబందించి ఇప్పటికే ఆరుగురికి అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై 354,355,376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు గాయత్రికి ఆమె సోదరి, తల్లితో ఆస్తి తగాదాలు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు తెలిపారు. 

అసలేం జరిగిందంటే..
గాయత్రి కొండాపూర్‌లోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి భాగస్వామి శ్రీకాంత్ సివిల్ కోచింగ్ సమయంలో బాధితురాలిని కలిశాడు. గాయత్రి తరుచుగా అనారోగ్యం పాలవుతుండడంతో ఆమెతో కలిసి ఉండాల్సిందిగా బాధితురాలిని కోరాడు. బాధితురాలు అక్టోబరు 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు గాయత్రితో పాటు వెళ్లింది. 

అయితే శ్రీకాంత్, బాధితురాలి మధ్య అనుబంధం ఉందని అనుమానించిన గాయత్రి ఆమెపై అత్యాచారం చేయడానికి ఐదుగురితో కలిసి ప్రణాళికలు రచించింది. ప్లాన్ ప్రకారం ఐదుగురు వ్యక్తులను గాయత్రి ఇంట్లోని గదిలో ఉంచి.. బాధితురాలని అక్కడి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారం చేయించి.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.

బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆమె కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను గాయత్రి, మనోజ్ కుమార్ (22), సయ్యద్ మస్తాన్ (25), షేక్ ముజాహిద్ (25), షేక్ మౌలా అలీ (32), పృధ్వీ విష్ణు వర్ధన్ (22)లుగా గుర్తించారు.

ఈ ఘటనపై గాయత్రి తల్లి స్పందించారు. తన కుమార్తె, శ్రీకాంత్‌ కలిసే ఈ డ్రామా ఆడారని ఆమె ఆరోపించారు. తన కూతురైనప్పటికీ.. ఆమె చేసిన వికృత చర్య సహించరానిదని... ఆమెకు ఏ శిక్ష వేసినా స్వాగతిస్తానని పేర్కొన్నారు. ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ.. గాయత్రికి గతంలో పెళ్లయిందని.. అయితే శ్రీకాంత్ కోసం భర్తను వదిలేసిందని చెప్పారు. తండ్రి చనిపోవడంతో పుట్టింటికి వచ్చిన గాయత్రి.. తోబుట్టువులతో గొడవ పడిందన్నారు. అప్పట్నుంచీ గాయత్రి శ్రీకాంత్‌తో కలిసి తన ఇంట్లో తిష్ఠవేసిందని.. ఇద్దరూ కలిసి తన ఆస్తులు కాజేయడానికి ప్లాన్‌ వేస్తున్నారని వాపోయారు. గాయత్రి, శ్రీకాంత్‌లు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారో లేదో తనకు తెలియదని చెప్పారు.