Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో నేడు కేసీఆర్ సభ.. చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల భూ నిర్వాసితుల ముందస్తు అరెస్ట్

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారానికి సీఎం కేసీఆర్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడులో జరగనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు మనుగోడు ప్రజా దీవెన సభగా పేరు పెట్టారు. 

Several Detained ahead of cm kcr munugode meeting
Author
First Published Aug 20, 2022, 9:14 AM IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారానికి సీఎం కేసీఆర్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడులో జరగనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు మనుగోడు ప్రజా దీవెన సభగా పేరు పెట్టారు. అయితే సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 
మర్రిగూడ మండలం చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల ముంపు గ్రామాల బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా వీరు దీక్షలు చేస్తున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

ఈ క్రమంలోనే పోలీసులు చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల భూనిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సభలో నిరసన తెలియజేస్తారనే అనుమానంతో ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక, పోలీసులు దాదాపు 80 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మునుగోడుపై దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఇక, నేడు సీఎం కేసీఆర్.. భారీ ర్యాలీగా హైదరాబాద్ నుంచి మునుగోడుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన సభ వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. ఈ సభకు భారీ జనసమీకరణపై జిల్లా టీఆర్ఎస్ నాయకులు దృష్టి సారించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios