తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డికి భారీ ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగదీష్ రెడ్డి పుట్టిపెరిగిన సొంత గ్రామం నాగారంలో సర్పంచ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాగారం సర్పంచ్ సావిత్రి, ఆమె భర్త వెంకట భిక్షం లను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజా ప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

సర్పంచ్ విషయంలో ఇదీ జరిగిన కథ

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నాగారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కన్నెబోయిన సావిత్రి పోటీ చేశారు. ఆమె మీద కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి (అప్పటి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం) కూడ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి కేవలం 18 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ (దామోదర్ రెడ్డి వర్గం) అభ్యర్థి కన్నెబోయిన సావిత్రి 230 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి మీద గెలుపొందారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేగా ఉన్న దామోదర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. సూర్యాపేటలో గెలిచిన జగదీష్ రెడ్డి మంత్రిగా నియమితులయ్యారు. ఇక ఎలాగైనా సొంత గ్రామంలో తిరుగులేకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి జగదీష్ రెడ్డి అన్న రకాలుగా ప్రయత్నాలు చేశారు. సామదాన బేధ దండోపాయాలు ప్రయోగించడంతో సర్పంచ్ కన్నెబోయిన సావిత్రి, ఆమె భర్త వెంటక భిక్షం కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారు. అనంతర కాలంలో నాగారం గ్రామాన్ని తన శక్తియుక్తులతో మండల కేంద్రంగా చేయించారు మంత్రి జగదీష్ రెడ్డి.

అయితే టిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన సావిత్రి, ఆమె భర్త వెంకట భిక్షంతోపాటు వారి వర్గం కూడా స్థానిక టిఆర్ఎస్ నేతలతో పాలు, నీళ్లలా కలిసిపోలేకపోయారు. అక్కడ ఇమడలేని పరిస్థితుల్లో వారు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలన్న తలంపుతో ఉన్నారు. తమకు రాజకీయ హోదా కల్పించింది దామోదర్ రెడ్డి కాబట్టి తాము సర్పంచ్ పదవి ఉన్నా.. ఊడిపోయినా సరే తాము మాత్రం దామోదర్ రెడ్డితోనే కలిసి పనిచేస్తామని వారు చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో దామోదర్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు.

ఈ పరిస్థితులను అంచనా వేసిన టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలాగైనా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోతే మన ప్రతిష్టకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో జనవరి 27వ తేదీన మండల టిఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి సర్పంచ్ కన్నెబోయిన సావిత్రి, ఆమె భర్త కన్నెబోయిన వెంకట భిక్షం ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మండల టిఆర్ఎస్ ఏకగ్రీవ తీర్మాణం అని మీడియాకు వెల్లడించారు. కానీ.. తెలంగాణ అంతటా బలమైన లీడర్లను, బలం లేని లీడర్లను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిఆర్ఎస్ లోకి ఆకర్షిస్తుంటే.. మంత్రి జగదీష్ రెడ్డి స్వగ్రామం నాగారంలో మాత్రం కాంగ్రెస్ నుంచి పార్టీలోకి తెచ్చుకున్న సర్పంచ్ ను కాపాడుకోలేకపోయారన్న విమర్శ మాత్రం మూటగట్టుకున్నారు. రాష్ట్ర మంత్రికి సొంత గ్రామంలో జరిగిన పరిణామం కొంత ఇబ్బందికరంగానే ఉందని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

 

పదవి నుంచి సస్పెండ్ చేపిస్తం అని బెదిరించిర్రు : సర్పంచ్ సావిత్రి

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తమను టిఆర్ఎస్ లోకి రప్పించేందుకు తీవ్రమైన వత్తిడి చేశారని సర్పంచ్ కన్నెబోయిన సావిత్రి, ఆమె భర్త కన్నెబోయిన వెంకట భిక్షం ఏషియానెట్ కు తెలిపారు. తమ మీద ఎంక్వైరీ వేయించి సస్పెండ్ చేయించాలని చూశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరూ తమను పార్టీలో చేరేందుకు నెలల తరబడి వత్తిడి చేశారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే తాము టిఆర్ఎస్ కుండవా కప్పుకున్నామన్నారు. అయినా టిఆర్ఎస్ లో తమకు వేధింపులు తప్పలేదన్నారు. సర్పంచ్ పదవి ఉన్నా పోయినా తాము నమ్ముకున్న దామోదర్ రెడ్డితోనే కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. తాము తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నామని తెలిసిన తర్వాతే హడావిడిగా మీటింగ్ పెట్టి సస్పెండ్ చేశారని చెప్పారు.