Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ వ్యాఖ్యలపై సెటైర్: 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Serving as Home Guard of Congress Party more than 3 decades Komatireddy Venkat Reddy in twitter bio
Author
First Published Aug 13, 2022, 2:48 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి హోం గార్డు వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు. ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో.. తాను కాంగ్రెస్ పార్టీ హోంగార్డునని పేర్కొన్నారు. బయోలో.. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో హోంగార్డులో సేవ చేస్తున్నట్టుగా యాడ్ చేశారు. 

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి మీడియాతోొ మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామం అని చెప్పారు. రాజీనామా చేస్తే అభివృద్ది అవుతుందంటే తాను రాజీనామా చేస్తానని అన్నారు. మునుగోడు ఎన్నికలు సెమీఫైనల్ అని చెప్పారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని.. ఉప ఎన్నికను వాళ్లే చూసుకుంటారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే కేసీఆర్.. ఫామ్ హౌస్, ప్రగతిభవన్‌ నుంచి బయటకు వస్తారని విమర్శించారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గానికి కేసీఆర్ అభివృద్ది వరాలు కురిపిస్తారని మండిపడ్డారు. తాను మునుగోడు వైపు వెళ్లనని స్పష్టం చేశారు.  

ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘34 ఏళ్లుగా పనిచేసిన హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్‌ కూడా కాలేడు. సివిల్స్‌ పరీక్ష రాసి జిల్లా ఎస్పీ అయినోళ్లను పట్టుకుని.. నేను ఇన్నేళ్లు ఎస్పీ ఆఫీస్‌ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవు తావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తాయి’ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే తనకు పీసీసీ ఇవ్వడాన్ని  ప్రశ్నించేవారిని ఉద్దేశించి.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారంజరిగింది.

ఇక, తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కలిగించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న ఇతర సీనియర్లు కూడా హోం గార్డులేనని ప్రశ్నించారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బేషరుతగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. రేవంత్ క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. తాను చూడలేదని.. వినలేదని చెప్పారు. మునుగోడులో నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అద్దంకి దయాకర్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. 

అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. మునుగోడు ఉపఎన్నికలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. నాయకులందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన వేళ.. ఇలా విభేదాలతో రచ్చకెక్కడం నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios