హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు మధ్య సోమవారం నాడు హాట్ హాట్ గా చర్చ సాగింది. సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 

బీఎసీ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మధ్య వాడీ వేడీ సంభాషణ చోటు చేసుకొంది. .అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేస్తే ఎలా అని భట్టి విక్రమార్క సీఎంను ప్రశ్నించారు.

సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వరు.. కనీసం మీడియా పాయింట్లోనైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని భట్టి విక్రమార్క  కోరారు.సభ కంటే మీకు మీడియా పాయింట్ ఎక్కువైందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

కరోనా కారణంగానే అసెంబ్లీలో మీడియా పాయింట్ ను ఎత్తివేశామని కేసీఆర్ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు.ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారంగా సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ భట్టికి చెప్పారు.

సభలో తాము కూడ అన్ని విషయాలు చెబుతామని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కూడ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి.. మేం చెప్పాల్సింది చెబుతామని స్పష్టం చేశారు.

కొత్త రెవిన్యూ చట్టం చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. కొందరు పిచ్చి పనులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు.

కొత్త రెవిన్యూ చట్టం విషయంలో స్టడీ కోసం నాలుగు రోజుల సమయం కావాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ చట్టాన్ని అధ్యయనం చేసేందుకు తమకు సమయం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అంత సమయం ఎందుకు అని కేసీఆర్ ప్రశ్నించారు.

కొత్త రెవిన్యూ బిల్లు తయారు చేయడానికే మీకు మూడేళ్లు పట్టిందని భట్టి కేసీఆర్ పై సెటైర్లు వేశారు.అవసరమైతే ఈ నెల 28వ తేదీన సభను పొడిగించాలని కేసీఆర్ ను భట్టి కోరారు. అయితే దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.