Asianet News TeluguAsianet News Telugu

బిజెపి సెప్టెంబర్ 17 వ్యూహం: కేసీఆర్ మాస్టర్ ప్లాన్

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని బిజెపి వ్యూహరచన చేసింది. ఆ వ్యూహరచనను కనిపెట్టిన కేసీఆర్ తన రాజకీయ చతురతతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

September 17 Telangana Liberation day: KCR master plan
Author
Hyderabad, First Published Sep 17, 2019, 6:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారతదేశమంతా ఆగష్టు 15, 1947లో స్వేఛ్ఛా వాయువును పీల్చుకుంటే, తెలంగాణ ప్రజలు మాత్రం మరో 13 నెలలపాటు ఆగవలిసి వచ్చింది. 1948 సెప్టెంబర్ 17న న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో వల్ల అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమయ్యింది. ఇలాంటి సెప్టెంబర్ 17 చారిత్రకంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. తెలంగాణ ఏర్పడకముందు సెప్టెంబర్ 17నాడు తెరాస పార్టీ ఈ రోజును తెలంగాణ లిబరేషన్ డే గా జరపాలని తెగ డిమాండ్ చేసేది. 

తెలంగాణ ఏర్పడి, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సెప్టెంబర్ 17 గురించి కెసిఆర్ నోరు మెదపడంలేదు. 2014-18 కాలంలో బీజేపీ ఈ దినోత్సవాన్నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరపాలని డిమాండ్ చేసినప్పటికీ, కెసిఆర్ కు బీజేపీకి ఉన్న అప్రకటిత మైత్రి వల్ల రాష్ట్ర బీజేపీ నేతలు ఈ డిమాండును బలంగాముందుకు తీసుకెళ్లలేకపోయారు. 

 2019 ఎన్నికల్లో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ను సొంతగా చేరుకోలేకపోతే తెరాస అవసరం ఉంటుందేమో అని బీజేపీ వేచి చూసింది. కానీ వారే 300పైచిలుకు రికార్డు సీట్లను సాధించడం, తెలంగాణాలో కెసిఆర్ కూతురు కవితపైన్నే విజయం సాధించడం, 4 సీట్లతో రెండో స్థానంలో నిలవడంతో బీజేపీ నూతనోత్తేజాన్ని ప్రదర్శిస్తోంది. కర్ణాటక తరువాత దక్షిణ భారత దేశంలో తమకు ఆస్కారమున్న రెండో రాష్ట్రంగా బీజేపీ తెలంగాణను పరిగణిస్తుంది. దీనితో ఇప్పుడు కెసిఆర్ ను నేరుగా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమయ్యింది.   

ఈ అనుకూల పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కేటాయించడం నుంచి మొదలుకొని అమిత్ షా నెలవారీ పర్యటనల వరకు ప్రతి విషయం మనకు బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి ఎంతలా కృషి చేస్తుందో నిరూపిస్తున్నాయి. తామే తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా ప్రయత్నిస్తున్నారు. 

ఈ ఊపును కొనసాగించేందుకు బీజేపీ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరిపి కెసిఆర్ సర్కారును మరింత ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రణాళికలు రచించింది. అందుకు తగ్గట్టుగానే గత నెలలో హైదరాబాద్ లో పర్యటించిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని సప్తాహాలు నిర్వహించాలని కూడా అన్నారు. 

కెసిఆర్ కు ఎంఐఎం  తో ఉన్న దోస్తీని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఈ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నింటిని జాగ్రత్తగా గమనించిన కెసిఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. దానికితోడు ఇతరాత్రా పరిస్థితులు కూడా కెసిఆర్ కు కలిసొచ్చాయి. 

మొదటగా ఈ సమయంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించ తలపెట్టాడు.  తద్వారా ప్రజల ఫోకస్ అంతా జరిగే అసెంబ్లీ సమావేశాలమీద కేంద్రీకృతమై ఉంటుంది. ఇలా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కెసిఆర్ తన అమ్ములపొదిలో ఉన్న ఒక అస్త్రాన్ని ప్రయోగించదలిచాడు. అదే ఇవాళ కెసిఆర్ సెప్టెంబర్ 17 విషయంలో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం -" తెలంగాణ సెంటిమెంట్".  పరిస్థితులు కొద్దిగా క్లిష్టంగా మారుతున్నాయి అనుకోగానే కెసిఆర్ ఈ అస్త్రాన్ని బహు బాగుగా వినియోగించుకుంటున్నాడు. 

డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కెసిఆర్ చంద్రబాబుపై ఇదే తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాడు. దీని ఎఫెక్ట్ వల్ల దాదాపుగా ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసాడు. ఇలా మరోమారు తెలంగాణ కు నిజమైన విమోచన ఆంధ్రోళ్ల పాలన నుంచి బయటపడ్డ జూన్ 2వ తారీఖున అనడంతో పూర్తిగా తెలంగాణ సెంటిమెంటును తనకు అనుకూలంగా వాడుకున్నాడు. 

దానికి తోడు జరుగుతున్న సేవ్ నల్లమల ఉద్యమం కెసిఆర్ నెత్తిన పాలు పోసింది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కెసిఆర్ ఏమీ మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించాడు.తద్వారా ఈ విషయమై చర్చ తీవ్రతరమవుతుంది. టీవీ చానెళ్లు డిబేట్లు కూడా ఈ విషయంపైన్నే నిర్వహిస్తాయి కూడా. ఆ తరువాత పరిస్థితులు పక్వానికి చేరుకున్నాక మాట్లాడదలుచుకున్నాడు కెసిఆర్. అదే చేసాడు కూడా. 

తొలుత కేటీర్ స్పందించాడు, అటుతరువాత సభలో యురేనియం తవ్వడానికి అనుమతులు ఇవ్వబోము అని తెలిపారు. ఈ రోజు ఏకంగా అసెంబ్లీలో ఈ విషయమై  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానమే చేసారు. 

ఇదంతా జరుగుతున్నప్పుడు బీజేపీ వారు నోరు మెదపలేని స్థితి. కారణం యురేనియం తవ్వకాలు కాంట్రాక్టులు అన్నీ కేంద్రప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కాబట్టి వారు ఈ సమయంలో ఏమీ మాట్లాడలేకపోయారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ వేసిన అఖిలపక్షంలోనూ బీజేపీ వారు చేరలేని పరిస్థితి. దీనితో వారికి ఎటువంటి టీవీ స్పేస్ కూడా దక్కలేదు. 

ఇదే టైంలో మొన్న దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంచీ మునిగి ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో అందరి దృష్టి అటు మళ్లింది. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల గారి విషాద మరణం ఇరు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 17ను రాజకీయం చేసి మైలేజి పొందుదామనుకున్న బీజేపీ ఆశలపై తన రాజకీయ దురంధరతతో కెసిఆర్ నీళ్లు చల్లాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios