హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని 8 సీట్లు ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆ సెంటిమెంట్. 

ఆ ఎనిమిది సీట్లు.. ఆందోల్, బోధన్, మంథని, వరంగల్ ఈస్ట్, సూర్యాపేట, జనగామ, నర్సాపూర్, షాద్ నగర్. ఈ సీట్లలో ప్రస్తుతం హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఆందోల్ లో గత ఎన్నికల్లో బాబూమోహన్ పై ఓడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రజా కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనపై టీఆర్ఎస్ తరఫున జర్నలిస్టు క్రాంతి పోటీ చేస్తున్నారు. బాబూ మోహన్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
దామోదర రాజనర్సింహ విజయం సాధించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నియోజకవర్గం నుంచి బయటకు రావడం లేదు. కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్ గా ఉండి కూడా ఆ ప్రణాళిక విడుదలకు కూడా రాకుండా ఆయన తన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. 

బోధన్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెసు తరఫున, టీఆర్ఎస్ తరఫున షకీల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంది. మరో సీటు మంథనిలో కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ తరఫున పుట్ట మధు పోటీ చేస్తున్నారు. పుట్ట మధుపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. ఓ సంఘటనలో దళిత యువకులు ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద యెత్తున ఆందోళన చేపట్టారు. 

మరో సీటు వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేని నరేందర్, కాంగ్రెసు తరఫున ఒద్దిరాజు రవిచంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఫలితం గురించి ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేస్తుండగా, కాంగ్రెసు నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుంది. అయితే, జగదీష్ రెడ్డి వైపు మొగ్గు ఉందనే ప్రచారం సాగుతోంది. 

జనగామలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెసు తరఫున పోటీ చేస్తుండగా, గతంలో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉంది.  నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ తరఫున మదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణ గాలివాటం వల్ల గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అంటారు. షాద్ నగర్ లో టీఆర్ఎస్ తరఫున అంజయ్య యాదవ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెసు నుంచి ప్రతాపరెడ్డి బరిలో ఉన్నారు.