నిజామాబాద్ జిల్లా బోధన్ అల్లర్ల వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. 

నిజామాబాద్ జిల్లా బోధన్ అల్లర్ల వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. ఈ అలర్ల వెనక శివసేనకు చెందిన గోపి హస్తం ఉందని గుర్తించినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల క్రితం మున్సిపల్ కౌన్సిల్‌లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని తీర్మానించారు. అయితే ఎప్పుడూ ప్రతిష్టించాలనే దానిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. అయితే గోపి.. కౌన్సిలర్ శరత్‌తో కలిసి విగ్రహా ప్రతిష్టకు ప్లాన్ చేశారు. 

ఉద్దేశపూర్వకంగా ఎవరికి తెలియకుండా విగ్రహా ప్రతిష్టాపనకు శరత్, గోపిలు ప్రణాళికలు రచించారు. రాత్రికి రాత్రే బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అల్లర్ల వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి గోపి, శరత్‌లు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పట్టణంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇక, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం రాత్రికి రాత్రే ఓ వర్గం శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాలు అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో నేడు బోధన్‌లో హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఇవాళ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బలవంతంగా బంద్ చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బోధన్‌లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పికెటింగ్ ఏర్పాటు చేసి.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బోధన్‌లో ఆర్టీసీ బస్సుల యథాతథంగా తిరుగుతున్నాయి. 

బోధన్‌లో పరిస్థితి అదుపులో ఉందని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ నాగరాజు తెలిపారు. నిన్నటి ఘటనలో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి పొందలేదని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించామని వెల్లడించారు. 170 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దని సూచించారు.