ఎన్నికల వేళ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భారీ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్ నేత చిలుకల గోవర్థన్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. 

ఎన్నికల వేళ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భారీ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్ నేత చిలుకల గోవర్థన్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దివంగత డీసీసీ నేత చకిలం శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన ఆయన మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా పనిచేశారు.

మున్సిపల్ ఛైర్మన్ పదవికి నేరుగా జరిగిన ఎన్నికల్లో గోవర్థన్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తన ఓటమికి కోమటిరెడ్డే కారణమని తెలిసినప్పటికీ... ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. నల్గొండ పట్టణంలోని బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

1977 నుంచి 2004 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్‌గా గోవర్థన్ పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందిన ఆయన మంత్రి జగదీశ్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన సూచనల మేరకు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. చిలుకల గోవర్థన్ చేరికతో తన గెలుపు ఖాయమేనంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి.