ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్మెన్లకు తొలగింపు.. తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్న బీజేపీ నేత..
బీజేపీ నేత, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్‌లను ప్రభుత్వం ఉపసంహరించింది.

బీజేపీ నేత, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్‌లను ప్రభుత్వం ఉపసంహరించింది. ఆయనకు గన్‌మెన్‌లను తొలగిస్తున్నట్టుగా వరంగల్ పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రదీప్ రావుకు నలుగురు గన్‌మెన్‌లు (2+2) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై స్పందించిన ప్రదీప్ రావు.. గత ఏడేళ్లుగా తనకు గన్‌మెన్లు ఉన్నారని చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గన్‌మెన్‌లను తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
తాను బీజేపీలో చేరినందుకే కక్ష సాధింపు చర్యలో భాగంగా గన్‌మెన్‌లను తొలగించారని అని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే తన అంతు చూస్తానని బెదిరిస్తున్నారని.. ఇలాంటి సమయంలో గన్‌మెన్‌లను తొలగించడం కక్ష సాధింపు అవుతుందని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని గతంలో గన్‌మెన్‌లను కేటాయించారు. తనకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్ బాధ్యత వహించాలని అన్నారు. ఇదిలా ఉంటే.. చాలా కాలం పాటు బీఆర్ఎస్‌లో కొనసాగిన ప్రదీప్ రావు.. కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.