హైదరాబాద్‌ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెక్యూరిటీ హెడ్‌ను సెక్యూరిటీ గార్డు హత్య చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

హైదరాబాద్‌ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెక్యూరిటీ హెడ్‌ను సెక్యూరిటీ గార్డు హత్య చేశాడు. డ్యూటీ విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. అరవింద్ అనే వ్యక్తి బహదూర్‌పల్లిలో ఆదర్శ్‌ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ హెడ్‌‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు రవి అదే సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే డ్యూటీకి సంబంధించిన విషయంలో అరవింద్‌, రవిలకు మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఇది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే రవి పదునైన ఆయుధంతో అరవింద్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన అక్కడివారు అరవింద్‌ను వెంటనే కొంపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుండిగల్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.