హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకున్న భారీ చోరీని కేవలం 24గంటల్లోనే చేదించారు పోలీసులు. సికింద్రాబాద్ లోని నేమిచంద్ జైన్ జ్యువెలరీ షాప్‌లో జరిగిన చోరీ ఇంటి దొంగల పనేనని పోలీసులు గుర్తించారు. 

వివరాల్లోకి వెళితే.. అనిల్‌ జైన్‌ అనే వ్యక్తి సికింద్రాబాద్‌లో నేమిచంద్‌ జైన్‌ జువెల్లరీ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం సంక్రాంతి పండగ కావడంతో ఇంట్లోనే మద్యాహ్నం వరకు కుటుంబసభ్యులతో గడిపిన అతడు ఆలస్యంగా షాప్ తెరిచాడు. అయితే షాప్ తెరవగానే అతడు షాక్ కు గురయ్యాడు. షాప్ లోని వస్తువులన్నీ చిందరమందరంగా పడటంతో చోరీ జరిగినట్లు గుర్తించిన అతడు పోలీసులకు సమాచారం అందించారు. 

జ్యువెల్లరీ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి ఇది ఇంటిదొంగల పనేనని అనుమానించారు. ఈక్రమంలోనే షాప్ లో పనిచేసే వారితో పాటు యజమాని అనిల్ జైన్ వద్ద పనిచేసే వారిని విచారించారు. ఈ క్రమంలోనే అనిల్ జైన్ డ్రైవర్ వ్యవహారశైలి అనుమానంగా కనిపించడంతో అతడిని తమదైన స్టైల్లో విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. 

శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దుకాణం వెనుక వైపు ఉన్న వెంటిలేటర్‌ గ్రిల్స్‌ వంచి లోపలికి ప్రవేశించినట్లు అతడు తెలిపాడు. దుకాణంలో ఉన్న కిలో 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్త్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. స్నేహితులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. దీంతో అతడి స్నేహితులను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.