సికింద్రాబాద్ రూబీ లాడ్జీ అగ్ని ప్రమాదం: బైక్ షోరూమ్ యజమానిపై కేసు
సికింద్రాబాద్ రూబీ లాడ్జీ ఉన్నభవనంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తును ప్రారంభించారుఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రూబీ లాడ్జీ ఉన్న భవనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. లాడ్జీ ఉన్న భవనానికి ఉన్న అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాడ్జీ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అగ్ని మాపక, విద్యుత్ శాఖ సిబ్బంది దర్యాప్తును ప్రారంభించారు. బైక్ షోరూమ్ యజమాని రంజింత్ సింగ్ బగ్గపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడుతో ఈ ప్రమాదం జరిగిందా లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై ఇంకా స్పష్టత రాలేదని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి మంగళవారం నాడు ఉదయం మీడియాకు తెలిపారు.
ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆమె వివరించారు. అధికారుల దర్యాప్తు పూర్తైన తర్వాత ఈ విషయమై స్పష్టత రానుంది. అగ్ని ప్రమాదం కారణంగా పొగ వ్యాపించడంతో పై నుండి కిందకు, కింద నుండి పైకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎనిమిది మంది మరణించారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాణాలు కాపాడుకొనేందుకు కొందరు భవనం పై నుండి దూకారు.ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణిస్తే మరో ఆరుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డీసీపీ చందనా దీప్తి వివరించారు.
లాడ్జీ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు.ఆ తర్వాత దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రెస్కూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ నడుపుతున్న రంజిత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురిని గుర్తించారు..మరణించినవారిలో హరీష్, వీరేంద్ర కుమార్, సీతారామన్, యశోధ, బాలాజీ, రాజీవ్ మైక్, సందీప్ మాలిక్ లున్నారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది..మృతదేహలను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేశవన్, జయంత్, డేబాశిష్ గుప్తా, సంతోష్, యోగిత, దీపక్ యాదవ్, ఉమేష్ కుమార్, మన్మోహన్ ఖన్నా, రాజేష్ లు గాయపడ్డారు.
బైక్ షోరూమ్ నిర్వాహకుడు రంజింత్ సింగ్ బగ్గపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూబీ లగ్జరీ హోటల్ భవనం సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో లాడ్జీలో 30 మంది పర్యాటకులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు.