హైదరాబాద్: తెలంగాణ సచివాలయ తరలింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ శాఖలు తరలిపోయాయి. చాలా శాఖలకు బీఆర్క్ భవన్ ను తాత్కాలిక భవంతిగా కేటాయించగా, మిగిలిన శాఖలకు వేర్వేరు చోట్ల వేర్వేరు భవనాలను కేటాయించారు. 

మిగిలిన కొన్నీ కార్యాలయాల తరలింపు కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేసారు. నేటి రాత్రికల్లా ఈ తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. నేటి అర్థరాత్రికల్లా తరలింపు పూర్తిచేసి సచివాలయానికి తాళం పెట్టాలని అధికారులు కృషి చేస్తున్నారు. 

రేపటినుంచి అధికారులు కానీ కార్యాలయ సిబ్బంది కానీ ఎవ్వరూ సచివాలయానికి రావాల్సిన అవసరం లేకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా డి-బ్లాకులోని మంత్రుల కార్యాలయాలను తరలిస్తున్నారు. 

సచివాలయ ప్రాంగణంలోని బ్యాంకులకు మాత్రం తరలింపునకు మరో రెండు రోజుల సమయం కేటాయించవచ్చు. అధికారులను, ఉద్యోగులను మాత్రం రేపటినుండి సచివాలయంలోకి అనుమతించరు. ప్రధానద్వారానికి తాళం వేయనున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరన్నా వెళ్లాల్సివస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవలిసి ఉంటుంది.