హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండోవిడత పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మెుదటి విడత పరిషత్ ఎన్నికలు పూర్తవ్వగా రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 180 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్, ఎంపీటీసీలకు ఎరుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేశారు. 

ఇకపోతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 

అన్ని పోలింగ్ బూత్ ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఇకపోతే ఈనెల 14న మూడో విడత పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.