కరోనా తర్వాత తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండో రోజు కూడా విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే నమోదైంది.

ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిన్న 9 శాతం హాజరు నమోదు కాగా.. ఇవాళ స్వల్పంగా పెరిగి 14 శాతం విద్యార్థులు బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 17 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 14 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.

ప్రభుత్వ బడుల్లో 5,47,479 మంది విద్యార్థులకు గాను 94,244 మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో 7,57,319 మందికిగాను 1,02,831 మంది విద్యార్థులు హాజరయ్యారు.

అత్యధికంగా నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో 28 శాతం హాజరుకాగా.. అత్యల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాల్లో 5 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు.