తెలంగాణను బస్సు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని సెయింట్ మేరీస్ హైస్కూలు బస్సు ప్రతి రోజు మాదిరిగా 60 మంది విద్యార్థులను ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరింది.

ఈ క్రమంలో బొడ్లాడ గ్రామ సమీపంలో అదుపుతప్పి పక్కనేవున్న పెద్ద బండను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఊడి దెబ్బతిన్నది. డ్రైవర్, క్లీనర్ సహా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు బస్సులో నుంచి విద్యార్థులను సురక్షితంగా కిందకు దించారు.

గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు.