ఆటోలో వెడుతున్న బాలుడిమీద పడిన కప్ప.. బెదిరి కిందపడి విద్యార్థి మృతి..
సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో స్కూలుకు వెడుతున్న బాలుడి మీద కప్ప ఎగిరిపడడంతో భయంతో ఆటోలోనుంచి కిందపడి మరణించాడు.
సిద్దిపేట : స్కూలుకు ఉత్సాహంగా తయారై తల్లికి బాయ్ చెప్పి ఆ ఆటోలో వెళ్లిన కుమారుడు.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం వేదనలో మునిగిపోయింది. ప్రయాణిస్తున్న ఆటోనుంచి కిందపడి గురువారం సిద్ధిపేట జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన బాలుడు జశ్వంత్(10) మృతి చెందాడు. గ్రామానికి చెందిన దాచారం నాగరాజు దంపతులకు పదేళ్లలోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు. కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇద్దరు పిల్లలను మండలంలోని బుర్ర గూడెం ప్రాథమిక పాఠశాలకు పంపిస్తున్నారు. ఐదో తరగతి చదువుతున్న జస్వంత్ రోజు మాదిరిగానే ఉదయం పాఠశాలకు ఆటోలు బయలుదేరాడు. అనంతగిరి పల్లి గ్రామం దాటుతుండగా ఆటోలో ఉన్న ఓ గొప్ప ఎగిరి డ్రైవర్ పక్కన కూర్చున్న జస్వంత్ వద్ద పడింది. దాంతో బెదిరిపోయిన అతడు ఒక్కసారిగా నడుస్తున్న వాహనంలో నుంచి కింద పడ్డాడు. దీంతో తల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నికలు.. 289లో 104 సెన్సిటివ్ పోలింగ్ బూత్ లు.. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం
అది గమనించిన డ్రైవర్ వెంటనే ఆటోను ఆపేసి.. బాలుడిని గమనించగా రక్తపుమడుగులో ఉన్నాడు. స్థానికుల సాయంలో బాలుడిని వెంటనే తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సలహా మేరకు హైదరాబాద్ తీసుకువెళ్లారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.