హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి స్కీమ్ వెనుకా ఒక స్కామ్ దాగుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. 

రోజురోజుకీ తెలంగాణాలో అవినీతి ఎక్కువవుతుందని, అన్ని శాఖలూ అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఎస్ ఐ స్కామ్ గురించి మాట్లాడుతూ, ఈ అవినీతి కేసుతో సంబంధమున్న నిందితులను తప్పించేందుకు అధికార తెరాస ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారేతప్ప ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఈ ఎస్ ఐ లో దాదాపుగా 300కోట్లమేర అవినీతి జరిగిందని, ఈ కేసుతో సంబంధమున్నవారందరినీ కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేసారు. 

నీలోఫర్ ఆసుపత్రి క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం గురించి మాట్లాడుతూ, అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరపడం దారుణం అన్నారు. ఇంతటి అమానుషమైన ఘటన తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రికి తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు. 

నయీమ్ కేసు విచారణ ఎందుకు మరుగున పడిందో ప్రజలకు వివరించాలని అధికార పక్షాన్ని నిలదీశారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలపై రాష్ట్రపతి నివేదిక కోరినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. నిజామాబాద్ రైతుల్లాగే హుజూర్ నగర్ రైతులు కూడా నామినేషన్లు వేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం వారిని అడ్డుకొని అరెస్ట్ చేయిందని అన్నారు ఈ చర్యను బీజేపీ ఖండిస్తుందని తెలిపారు. 

హుజూర్ నగర్ లో ఈ సరి ఎగిరేది కాషాయ జెండానే అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేసారు. బీజేపీ అభ్యర్థిగా రామారావు ను ఖరారు చేశామని, ఆయన రేపు నామినేషన్ వేస్తారని లక్ష్మణ్ తెలిపారు.