తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక తెప్పించుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ బాలల హక్కుల సంఘం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై సోమవారం జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం వెల్లడించింది.

ఇప్పటికే కొండలరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసినట్లు జస్టిస్ నవీన్ సిన్హా తెలిపారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని ఏకీభవించలేమని న్యాయస్థానం తెలిపింది.

సుప్రీం తీర్పుపై బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌రావ్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని అదే సమయంలో విద్యార్ధులు ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.