Asianet News TeluguAsianet News Telugu

సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...

సేవ్ నల్లమల అంటూ తెలంగాణ సిఎం కేసీఆర్ కుమారుడు హిమాన్షు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. అది కేసీఆర్ కు వ్యతిరేకమని అనిపిస్తుంది. కానీ కేసీఆర్ బిజెపిని ఎదుర్కోవడానికి రచించిన వ్యూహంలో భాగమేనని అనిపిస్తోంది.

Save Uranium< Himanshu tweet: KCR to target BJP
Author
Hyderabad, First Published Sep 15, 2019, 5:48 PM IST

తెలంగాణ రాజకీయాలు పార్లమెంటు ఎన్నికల తరువాత ఓక కొత్త రూపును సంతరించుకున్నాయి. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత పెద్ద రాజకీయ శక్తి కాదు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 4 సీట్లను గెలిచి రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు వరకు కేవలం కాంగ్రెస్, తెరాస ఈ రెండు పార్టీల చుట్టూ మాత్రమే తిరిగిన రాజకీయం ఇప్పుడు బీజేపీ ఎంట్రీ తో మూడు ముక్కలాటగా మారింది. 

దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న నాయకాత్య లేమి దృష్ట్యా కాంగ్రెస్ బలహీనపడ్డట్టుగా మనకు అర్థమౌతుంది. దీనితోనీపాటు పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీని గట్టిగానే దెబ్బతీశాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ రెడ్డి కి మంత్రి పదవిని కేటాయించడం నుంచి మొదలుకొని అమిత్ షా నెలవారీ పర్యటనల వరకు ప్రతి విషయం మనకు బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి ఎంతలా కృషి చేస్తుందో తెలియజేస్తున్నాయి. తామే తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా ప్రయత్నిస్తున్నారు. 

గత దఫాలో తెరాసకు బీజేపీకి ఒక అప్రకటిత మైత్రి ఉండేది. 2019 ఎన్నికల్లో ఒకవేళ తాము మ్యాజిక్ ఫిగర్ ను సొంతగా చేరుకోలేకపోతే తెరాస అవసరం ఉంటుందేమో అని బిజెపి వేచి చూసింది. కానీ వారే 300పైచిలుకు రికార్డు సీట్లను సాధించడం, తెలంగాణాలో కెసిఆర్ కూతురు కవితపైన్నే విజయం సాధించడం, 4 సీట్లతో రెండో స్థానంలో నిలవడంతో బీజేపీ నూతనోత్తేజాన్ని పొందిదంి. కర్ణాటక తరువాత దక్షిణ భారత దేశంలో తమకు ఆస్కారమున్న రెండో రాష్ట్రంగా బీజేపీ తెలంగాణను పరిగణిస్తుంది. దీనితో ఇప్పుడు కెసిఆర్ ను నేరుగా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమయ్యింది. 

ఈ పరిస్థితులన్నిటిని గమనిస్తున్న కెసిఆర్ కూడా ఒకింత కలవరపడుతున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి గానాలు ఎక్కువవుతున్న వేళ కెసిఆర్ ఇక ఊరికే కూర్చుంటే లాభంలేదు అని తానే స్వయంగా రంగంలోకి దిగారు. మొదటగా అసమ్మతి నేతలను ఒకింత శాంతపరిచాడు. హరీష్ కు ఆర్ధిక శాఖను కట్టబెట్టి హరీష్ ను పక్కన పెట్టడం వల్ల వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. 

ఇక ఏకంగా బీజేపీనే నేరుగా టార్గెట్ చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే బడ్జెట్ ను తానే ప్రవేశపెట్టాడు. అందులో కూడా ముఖ్యంగా దేశ ఆర్థికపరిస్థితి అయోమయంగా ఉందని, మందగమనంలో నడుస్తుందని లెక్కలతో సహా సభ ముందుంచారు. అక్కడితో ఆగకుండా ఈ పరిస్థితులన్నిటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని చెప్పకనే చెప్పాడు. 

మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందరూ గనుక గమనించివుంటే రోడ్లపైన గుంతలను శరవేగంగా పూడ్చుతున్నారు. రెగ్యులర్ గా ఫాగింగ్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉంది తెరాస సర్కార్. 

ఇలాంటి సమయంలో నల్లమలలో యురేనియం తవ్వకాల గురించి విపరీతమైన చర్చ మొదలయ్యింది. దీనిపైన కెసిఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చి బిజెపిపై సమరానికి పునాది వేసినట్లు కనిపిస్తున్నారు. ఆదివారం శాసనసభలో మాట్లాడిన విషయాలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. 

వాస్తవానికి యురేనియం తవ్వకాలు, వెలికితీత దానికి సంబంధించిన అన్ని పనులను పర్యవేక్షించేది కేంద్ర ప్రభుత్వ సంస్థైన యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్. ల్యాండ్ (భూమి) అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లోని రాష్ట్రాల లిస్టులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సదరు ప్రాజెక్టులకు అనుమతులిస్తాయే తప్ప వేరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. 

ఆ స్థితిలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీల నుంచి మొదలుకొని పర్యావరణవేత్తలు వరకు సేవ్ నల్లమల పేరిట సోషల్ మీడియా లో తెగ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి సేవ్ నల్లమల పేరిట సర్క్యూలేట్ అవుతున్న ఒక పిటిషన్ గురించి తెలిసే ఉంటుంది. మనలో చాలామంది దీనిపై సంతకాలు కూడా చేసే ఉంటారు. 

పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని విజయ్ దేవరకొండ వరకు చాలామంది సినిమా సెలెబ్రిటీలు ఇందులో భాగస్వాములయ్యారు కూడా. విజయ్ దేవరకొండ ఏకంగా, యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ అడవులను కొనుక్కోలేము అంటూ ఘాటుగా ట్వీట్ చేసాడు. ఏకంగా ముఖ్యమంత్రి మనవడు, కేటీర్ తనయుడు హిమాంశు ఇంస్టాగ్రామ్ వేదికగా సేవ్ నల్లమల అంటూ పోస్టు పెట్టాడు. 

ఇలా ఈ నిరసనలకు దిగుతున్నవారంతా కెసిఆర్ కు సన్నిహితులేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కెసిఆర్ కు అప్రకటిత మద్దతు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ కూడా కెసిఆర్ సామాజికవర్గానికే చెందిన వ్యక్తి అవడం, దూరపు చుట్టరికం కూడా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయాన్ని పదేపదే నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాతకు వ్యతిరేకంగా మనవడు పోస్టులు పెట్టడం మరీ హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేస్తున్నారు. 

కొద్దిసేపు ఈ విషయాలను పక్కకు పెడదాం. మొత్తానికి నల్లమల విషయంలో తీవ్ర స్థాయిలో చర్చ మాత్రం నడుస్తుంది. ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా కెసిఆర్ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడడానికి ముందు కేటీర్ మాత్రం తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పాడు. ఈ రోజు కేవలం యురేనియం అన్వేషణలకు మాత్రమే అనుమతులిచ్చామని, తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పాడు. 

కెసిఆర్ ఇంతవరకు దీనిపైన స్పందించకపోవడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు ఉద్యమం తారాస్థాయిలో ఉంది. మునిసిపల్ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సమయం చూసుకొని కెసిఆర్ దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు ఇంత కాలం వేచి చూసినట్లు అర్థం చేసుకోవచ్చు.

ఈ యురేనియం తవ్వకాలు, పర్యావరణ కాలుష్యాన్ని చూపెట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీని దోషిగా నిలిపే ప్రయత్నం చేయనున్నారు కెసిఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని మరోమారు తెరమీదకు తీసుకువచ్చి మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. 

ఈ విషయమై 'ఢిల్లీ కి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటామా?' 'బీజేపీ గెలిస్తే తెలంగాణ ను కొల్లగొడుతారు,' 'ఈ యురేనియం తవ్వకాలవల్ల హైదరాబాద్ కు నీళ్లందించే కృష్ణా కలుషితమైపోతుంది, హైదరాబాద్ కు తాగునీరుండదు' వంటి అనేక అంశాలను ముందుకు తీసుకొచ్చి బీజేపీ ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. 

ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు అవసరంలేని ఏ కేంద్ర పథకాన్ని కూడా అమలు చేయమని చెప్పిన కెసిఆర్ దానిలో భాగంగానే కొత్త ట్రాఫిక్ ఫైన్ల జోలికి వెళ్లకుండా దాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టారు. పోలీసులు ఇప్పుడు ఫైన్లకు బదులు హెల్మెట్లు కొనిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల వేళ మరో బలమైన అస్త్రంగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ కొత్త చట్టాన్ని అమలుచేయట్లేదంటే ఈ చట్టం అవసరం లేదని కూడా కెసిఆర్ మాట్లాడవచ్చు. 

సెప్టెంబర్ 17 విషయంలో కెసిఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు స్కెచ్చులు గీస్తున్న బీజేపీ ఈ విషయంలో కెసిఆర్ ను ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios