హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్ మాదాపూర్ లోని దసపల్లా హాటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వి. హనుమంతరావు చొరవతో ఏర్పాటవుతున్న ఈ సమావేశంలో జస్టిస్ గోపాల్ గౌడ, జనసేన పార్టీ నుంచి పవన్ కల్యాణ్ , నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వి. హనుమంతరావు, రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. 

తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ,  సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ నుంచి కోదండరామ్ పాల్గొంటారు. 

తెలంగాణ ఇంటిపార్టీ నుంచి శ్రీ చెరుకు సుధాకర్  తోపాటు పలువురు రాజకీయవేత్తలు, పర్యావరణ శాస్ర్తవేత్తలు, మేధావులు, నిపుణులు, నల్లమల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు పాల్గొంటారు.