మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య . కొందరు తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని ముసుగులు తీసేయాలంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు తప్పుడు ప్రపచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముసుగు తీసి రాజకీయాలు చేయాలని... టీడీపీలో వున్నప్పుడు ఒకలా, టీఆర్ఎస్‌లో చేరాక మరోలా ఇబ్బంది పెడుతున్నారని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానెక్కడా అహంభావంతో పనిచేయలేదని, కొందరు తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గతంలో ఎప్పుడైనా సత్తుపల్లిలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నించారు. తన హయాంలో నియోజకవర్గానికి రూ.60 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే సీనియర్ నేత , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించే సండ్ర ఈ వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Also REad: ఖమ్మం టీఆర్ఎస్ లో చిచ్చు:సత్తుపల్లిలో ఎంపీల సన్మానానికి తుమ్మలను ఆహ్వనించొద్దంటున్న కందాల

కాగా... 2018 ఎన్నికల్లో పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. తర్వాతి కాలంలో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గాలకు మధ్య పొసగడం లేదు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొందరు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమనే ఆరోపణలు వచ్చాయి. పలు కారణాలలతో 2019 లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఇటీవల వాజేడులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తాను కేసీఆర్ వెంటే ఉంటానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.