తెలంగాణలో తీవ్ర కలకం రేపిన సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులను 5 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు నేటి నుంచి వారిని విచారించనున్నారు.
తెలంగాణలో తీవ్ర కలకం రేపిన సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. నాగరాజును హత్య చేసిన మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌లను 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని సరూర్ నగర్ పోలీసులు కోరారు. అయితే ఇద్దరిని ఐదు రోజుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే కాసేపట్లో సరూర్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోనున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు నిందితులు మోబిన్, మసూద్‌లను పోలీసులు విచారించనున్నారు.
అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు(25), ఆశ్రిన్ సుల్తానా (25) పాఠశాల వయస్సు నుంచి ప్రేమించుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. మే 4న రాత్రి 7గంటల సమయంలో సరూర్ నగర్ పంజాల అనిల్‌కుమార్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగరాజు దంపతులను అశ్రిన్ సోదరుడు మోబిన్, బావ షకీల్ అహ్మద్ అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పక్కకు నెట్టి నాగరాజును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
‘‘మరో మతానికి చెందిన వ్యక్తితో అశ్రిన్ పెళ్లిని వ్యతిరేకించిన ఆమె సోదరుడు సయ్యద్ మోబిన్ అహ్మద్, ఆమె బావ సయ్యద్ షకీల్ అహ్మద్‌లు.. నాగరాజుపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అంతమొందించడానికి కుట్ర పన్నారు’’ అని డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ చెప్పారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని.. వీలైనంత త్వరగా వారికి శిక్షపడేలా చూస్తామని తెలిపారు.
ఇక, హత్యకేసులో ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి మూత్రపిండాల వ్యాధికి గురవడంతో డయాలసిస్ చేయించేందుకు అనువుగా ఉంటుందని ఐడీపీఎల్ కాలనీ గురుమూర్తి నగర్ చేరారు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించడంతో కుటుంబ భారం మోబిన్ అహ్మద్ పై పడింది. తల్లి, ముగ్గురు చెల్లెలు, తమ్ముని పోషించేందుకు పండ్లు విక్రయించేవాడు. నిరుడు రెండో సోదరిని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్ కు ఇచ్చి వివాహం చేశాడు. మూడో చెల్లెలు ఆశ్రిన్ సుల్తానాకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు.
ఈ ఏడాది జనవరిలో భార్య మరణించి, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో ఆమెకుపెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యాడు. సోదరి ఎదురు తిరగడం, కొట్టినా దారికి రాకపోవడంతో గొడవలు పెరిగాయి. అక్కడే ఉంటే పెళ్లి చేస్తారు అని భయపడిన ఆశ్రిన్ సుల్తానా జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు చేరింది. ఫిబ్రవరి 1న ఇద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. బాల నగర్ పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత నాగరాజు, ఆశ్రిన్ వికారాబాద్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. రెండుసార్లు నాగరాజు మోబిన్ అహ్మద్ తో మాట్లాడాడు. మతం మారేందుకు తాను సిద్ధమేనంటూ చెప్పాడు.
అక్క చెప్పిన ఆశ్రిన్ ఆచూకీ..
పెళ్లి తర్వాత ఆశ్రిన్ సుల్తానా లింగంపల్లిలో ఉన్న అక్క, పిన్నితో ఫోన్ లో మాట్లాడేది. అక్క భర్త ద్వారా మోబిన్ అహ్మద్ కు దంపతుల ఆచూకీ తెలిసింది. నాగరాజు, ఆశ్రిన్ ఫోన్ నెంబర్లను సేకరించిన మోబిన్ అహ్మద్ స్నేహితుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నాగరాజు మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయించాడు. లొకేట్ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నారు అనే సమాచారం సేకరిస్తూ వచ్చాడు. మార్చిలోనే హత్యకు పథకం వేసినా రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో వాయిదా వేశాడు. రంజాన్ మరుసటి రోజు ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.
