52 రోజులుగా తనకు న్యాయం చేయాలని దీక్ష చేస్తున్నారు సంగీత. తన భర్త మూడో పెళ్లి చేసుకుని తనపై దాడి చేసి కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 52రోజులుగా బోడుప్పల్ లోని భర్త ఇంటి ముందే సంగీత ఆందోళన చేస్తున్నారు.

అయితే నిన్న సోమవారం సంగీత ఆమరణ దీక్ష మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తన సన్నిహితులు, మహిళా నేతల సూచన మేరకు ఇవాళ 24 గంటల తర్వాత ఆమరణ దీక్షను సంగీత విరమించుకున్నారు. మహిళా సంఘాల నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

అయితే సాధారణ దీక్ష ఇకపై కూడా కొనసాగిస్తానని.. తనకు, తన పాపకు న్యాయం జరిగే వరకు దీక్ష కంటిన్యూ అవుతుందని ప్రకటించారు సంగీత.

రేపు కీలక పరిణామం...?

గత 52 రోజులుగా భర్త ఇంటి ముందే దీక్ష చేస్తున్న సంగీత రేపు  ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించే చాన్స్ ఉన్నట్లు మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు. టిఆర్ఎస్ ఎంపి మల్లారెడ్డి జోక్యం చేసుకున్నా.. ఇప్పటి వరకు సంగీతకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో ఇక దీక్షకు పులిస్టాప్ పెట్టి.. ఇంటి తాళం పగలగొట్టి ఇంటినే ఆక్రమించుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఈ దిశగా మహిళా సంఘాల నేతలు సంగీతకు సూచించారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు దీనిపై సంగీత తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందంటున్నారు.