రేపు ట్యాంక్ బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు.

తన నియోజకవర్గంలో 40 వేల మంది ఇళ్లు లేని పేదలున్నారని ఆయన తెలిపారు. ఎన్నో సార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించడం లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న కరోనా ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు ,కాలేజీలు మూసి వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆయన ప్రశంసించారు.

లాక్ డౌన్ వచ్చి మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడొద్దు అనుకుంటె వైన్ షాపు లు, బార్‌లు, సినిమా థియేటర్లు, పార్క్‌లు కూడా మూసివేయాలని జగ్గారెడ్డి కోరారు.

విద్యాసంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలపై స్పందించకపోవడం దారుణమని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు ఆర్థిక సంక్షోభంలో ఉండరా అంటూ ప్రశ్నించారు.