తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వల్ల తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయిందన్న వాదనను ఆయన ఖండించారు.

చంద్రబాబును ఒక జాతీయ స్థాయి నేతగా మాత్రమే చూడాలని, ఆయన వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం కలగలేదన్నారు. టీడీపీ ఎక్కడైనా పోటీ చేసుకునే అవకాశం ఉందన్నారు. పొత్తు నిర్ణయం కాంగ్రెస్ పార్టీదేనని... దానిని పార్టీలో ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు.

కాంగ్రెస్ ఓటమికి వేరే కారణాలు ఉన్నాయని, వాటిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తనకు సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు.

టీడీపీతో పొత్తు వల్ల వైసీపీ శ్రేణులు... తమ ఓటును టీఆర్ఎస్‌కే వేశాయన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పొత్తులు ఉండాల్సిందేనని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మెదక్ టికెట్ తన భార్యకు ఇస్తే గెలిపించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.