తాను కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని.. కాంగ్రెస్‌ను మాత్రం వీడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

పార్టీ మారాలని తనను ఎవరూ సంప్రదించలేదని... పార్టీ మారుతానని తానెవరిని కలవలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడుతున్నాన్న వార్తల్లో నిజం లేదని జగ్గారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోసారి జైలుకు పంపించినా పోరాడుతానని, కాంగ్రెస్‌ను మాత్రం వీడనని చెప్పారు. గతంలోనూ ఓసారి పార్టీ మారడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందన్న కూతురు జయారెడ్డి వ్యాఖ్యలు తనను ఆలోచింపచేశాయని తెలిపారు.

ఆమె మాటకు గౌరవం ఇస్తూ.. కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు జగ్గారెడ్డి కొద్దిరోజుల నుంచి అజ్ఞాతంలో ఉండటం, కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసినా స్పందించకపోవడం టీపీసీసీలో చర్చనీయాంశమైంది.

అలాగే టీఆర్ఎస్ అంటే అంతెత్తున లేచే ఆయన.. ఈ మధ్య కేసీఆర్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి గులాబీ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది.