కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై తన మనసులో ఉన్న ఆలోచనను కుండబద్ధలు కొట్టారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేస్తానని స్పష్టం చేశారు.

జూలై 10 నుంచి సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి సమయం కేటాయిస్తానని అన్నారు. పార్టీ మారిన వాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు.

పార్టీలోనే ఉండి గోతులు తవ్వే వాళ్లపై అధిష్టానం దృష్టి సారించాలని జగ్గారెడ్డి కోరారు. మరోవైపు తాను పార్టీ మారుతానన్న వ్యాఖ్యలపై ఆయన గతంలోనే స్పందించారు.

తనను టీఆర్ఎస్‌లోకి రమ్మని ఎవరు పిలవలేదని.. తాను కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని ప్రయత్నించలేదన్నారు. తన రాజకీయ అడుగులన్నీ సంగారెడ్డి ప్రజల కోసమేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.