ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్లూరు మేజర్  గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా  ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకొంది. అధికార టీఆర్ఎస్ ఫ్లెక్సీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  ఫోటో ముద్రించారు. వెంకట వీరయ్య  టీఆర్ఎస్‌లో చేరుతారనే  ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ ఫ్లెక్సీ  కలకలం రేపుతోంది.

 కల్లూరు మేజర్ గ్రామ పంచాయితీని కైవసం చేసుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే  ఈ స్థానానికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థిని టీఆర్ఎస్‌ నేతల ఫోటోలతో పాటు సండ్ర వెంకటవీరయ్య ఫోటోను కూడ ముద్రించారు. టీడీపీ బలపరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి అంటూ ఈ ఫ్లెక్సీపై ముద్రించారు.    ఈ ఫ్లెక్సీ గులాబీ రంగులో ఉంది.  

టీడీపీ నుండి సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  సండ్ర వెంకటవీరయ్య  మూడు దఫాలు వరుసగా విజయం సాధించారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే ఈ ఫ్లెక్సీ లో సండ్ర ఫోటో మరోసారి చర్చకు దారి తీసింది.