ఖమ్మం: తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనను టీఆర్ఎస్ చేర్చుకోవడానికి టీఆర్ఎస్ కొన్ని ఆఫర్లు ఇవ్వడంతో పాటు ఓ షరతు కూడా పెట్టారని వినికిడి.

ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించినవారిలో సండ్రతో పాటు మెచ్చా నాగేశ్వర రావు కూడా ఉన్నారు. ఇద్దరిని కూడా తమ పార్టీలో చేర్చుకుని టీడీపిని తెలంగాణలో ఖాళీ చేయాలనేది టీఆర్ఎస్ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. 

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్యతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని సమాచారం. తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని సండ్రకు టీఆర్ఎస్ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ఆశ్వారావుపేట నుంచి టీడీపి తరఫున పోటీ చేసి గెలిచిన మెచ్చా నాగేశ్వర రావును కూడా పార్టీలోకి తీసుకు రావాలని టీఆర్ఎస్ నాయకులకు ఆయనకు షరతు పెట్టినట్లు సమాచారం. 

టీఆర్ఎస్ చేరాలని సండ్ర మెచ్చాకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తనకు కొంత సమయం కావాలని మెచ్చా నాగేశ్వర రావు సండ్రతో అన్నారని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ మారితే ఫలితం ఉండదని భావిస్తున్న సండ్ర మెచ్చాపై ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు. 

మరోవైపు, ఓటుకు నోటు కేసులో సండ్ర రెండో నిందితుడిగా ఉన్నారు. మళ్లీ ఆ కేసు తెర మీదికి వస్తే తిప్పలు తప్పవనే ఉద్దేశంతో కూడా ఆయన పార్టీ మారాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తం టీడీఎల్పీనే టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా ఆయన పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.