శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మద్యం మత్తులో హోంగార్డు కారును నడుపుతూ లారీని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో నిందితులను పోలీసులు గుర్తించారు.
శంషాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకులను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారును నడిపి లారీ బోల్తా పడడానికి కారణమైన ముగ్గురిని పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ గిరిప్రసాద్, హోంగార్డు సంగమేశ్వర్, మల్లేష్ అనే మరో వ్యక్తి కారులో ఉన్నట్లు గుర్తించారు.
హోంగార్డు సంగమేశ్వర్ ప్రమాదం జరిగినప్పుడు కారు నడుపుతున్నట్లు గుర్తించారు. మిత్రులు సంగమేశ్వర్, గిరిప్రసాద్, మల్లేష్ ఆదివారంనాడు యాదాద్రి వెళ్లి తిరిగి వస్తూ మధ్యలో మద్యం సేవించినట్లు గుర్తించారు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వస్తూ లారీని ఢీకొట్టినట్లు గుర్తించారు. గతంలో కారుపై అతి వేగానికి సంబంధించి ఓ చలాన్ కూడా ఉంది.
శంషాబాద్ రోడ్డు ప్రమాదానికి కారు డ్రైవర్ కారణమని పోలీసులు తేల్చారు. శంషాబాద్ లో కారు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారంనాడు మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
డ్రైవర్ మద్యం సేవించి నడుపుతూ లారీకి ఎదురుగా కారును తీసుకుని వెళ్లాడని, కారును తప్పించడానికి లారీ డ్రైవర్ ప్రయత్నించాడని, దాంతో లారీ పల్టీ కొట్టి ఆరుగురు మరణించారని పోలీసులు అంటున్నారు. కారు శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతులంతా వలస కూలీలని భావిస్తున్నారు. ఆరుగురు మరణించగా 15 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
శంషాబాద్ నుంచి కూరగాయలు తీసుకుని వెళ్తున్న క్రమలో ఆ ప్రమందా సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు లారీలో దాదాపు 30 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
