హైదరాబాద్: వస్త్ర దుకాణానికి చీర కొనేందుకు వెళ్లిన ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కూకట్ పల్లిలోని 8ఎ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్  కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా విధించింది. 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి గ్రామానికి చెందిన చింతకింది యాదగిరి(27) జగద్గిరిగుట్ట అంజయ్యనగర్‌లో నివసిస్తూ కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని ఓ వస్త్రదుకాణంలో సేల్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. 
 
2018 జూలై 31న చీర కొనుగోలు చేసేందుకు ఓ విద్యార్థిని ఆ షోరూంకి వెళ్లింది. తాను ఎంపిక చేసుకొన్న చీర కట్టుకొంటే ఎలా ఉంటానో చూపించమని ఆమె కోరగా యాదగిరి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.  

దాంతో సేల్స్ సూపర్ వైజర్ పై ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన కూకట్ పల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీదేవి నిందితుడికి ఏడాది జైలు శిక్ష,రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.