సుమారు 7లక్షల మంది ఉద్యోగులు, రెండు లక్షల మంది పెన్షనర్లకు అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు జీతాల కష్టాలు మొదలవ్వనున్నాయి. మరో పది రోజుల్లో నవంబర్ నెల జీతాలను ఉద్యోగులు అందుకోనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను రెండు ప్రభుత్వాల్లోని ట్రెజరీ శాఖలు సిద్ధం చేస్తున్నాయి. దాంతో సుమారు 7లక్షల మంది ఉద్యోగులు, రెండు లక్షల మంది పెన్షనర్లకు అసలు సమస్యలు మొదలవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సమస్యలతో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారికి తాజాగా ఉద్యోగులు కూడా జత చేరనున్నారు.
అక్టోబర్ నెల జీతాలను అందరిలాగే ఉద్యోగులు కూడా నవంబర్ మొదటి తేదీనే అందుకున్నారు. దాంతో నవంబర్ లో చేయాల్సిన చెల్లింపులను చాలా మంది ఉద్యోగులు మొదటి వారంలోనే చేసేసారు. నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రకటించినపుడు ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇబ్బందులు పడలేదు. అయితే, రద్దు తర్వాత చేయాల్సిన చెల్లింపులు, అవసరాలకు చేతిలో సరిపడా డబ్బులేక మాత్రం ఇబ్బందులు తప్పలేదు.
అయితే, డిసెంబర్లో అందుకోనున్న జీతాల విషయంలో ఏమి చేయాలో అర్ధంకాక ఉద్యోగుల్లో ఆందళన మొదలైంది. మొత్తం జీత, బత్యాలను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో మాత్రమే జమచేస్తుంది. ఒకసారంటూ ఖాతాలో జీతం జమైతే బ్యాంకు ఖాతా నుండి ఇష్టమొచ్చినట్లు తీసుకునేందుకు లేదు. ఒకసారికి రెండువేల రూపాయలు, చెక్ ద్వారా అయితే వారానికి ఒకసారికి రూ. 24 వేల రూపాయలు మాత్రమే బ్యాంకులు ఇస్తుండటంతో ఇబ్బందులు తప్పవని ఆందోళనలో ఉన్నారు. ఇంటి అవసరాలకు సరిపడా డబ్బులు తీసుకోవాలంటే ఎన్ని సార్లు బ్యాంకు క్యూలో నిలబడక తప్పదని ఉద్యోగులు ఉసూరుమంటున్నారు.
బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకునేందుకు ప్రస్తుతం ప్రజల పడుతున్న ఇబ్బందులను చూస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ బాధల నుండి తప్పించుకునేందుకు ఖతాల్లో జీతాలు జమ చేయకుండా నేరుగా నగదునే ఇచ్చేయమని ప్రభుత్వాన్ని అడిగారు. అయితే, ప్రభుత్వం కుదరదన్నది. పోనీ బ్యాంకుల్లో తమ కోసం ప్రత్యేక కౌంటర్లన్నా తెరిచేట్లు బ్యాంకులను ఆదేశించాలని ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విన్నపం కూడా సాగలేదు. ఉద్యోగుల కోసమే ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు తమ వద్ద అదనపు సిబ్బంది ఉండరని బ్యాంకులు స్పష్టం చేసాయి. దాంతో ఉద్యోగులకు ఏమి చేయాలో అర్దం కావటం లేదు.
