హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.

కొండాపూర్‌ డివిజన్‌లో హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట తోపాటు పలు డివిజన్లలోని పోలింగ్‌ కేంద్రాల్ని పరిశీలించి పోలింగ్‌ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్‌ కోరారు. కాగా.. పోలింగ్ ఇంకా కొనసాగుతోంది.

ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. ప్రజలు కూడా ఉదయం నుంచి ఓటు వేస్తూనే ఉన్నారు. అయితే.. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఏడాది పోలింగ్ శాతం తక్కువగా నమోదౌతున్నట్లు తెలుస్తోంది. కరోనా భయంతో ప్రజలు ఓటు వేయడానికి కూడా రావడం లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.