హైదరాబాద్: మైనర్ బాలికతో అసభ్యంగా చాటింగ్ చేసిన యువకుడిని భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డిని మధ్యప్రదేశ్ లోని భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

భోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మైనర్ బాలికకు సాయినాథ్ రెడ్డి నకిలీ ఫేస్ బుక్ ఖాతా నుండి అసభ్యకర మేసేజ్ లను పెడుతున్నాడు. ఈ విషయమై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫేస్ బుక్ చాటింగ్ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు.ఈ విచారణలో కొందుర్గుకు చెందిన సాయినాథ్ రెడ్డి ఈ చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 
కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ఫేస్ బుక్ నుండి ఈ మేసేజ్ లు వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ విషయమై భోపాల్ పోలీసులు ఉత్తరాసిపల్లికి చెందిన బాలికను ప్రశ్నిస్తే సాయినాథ్ రెడ్డి పేరును ఆమె బయటపెట్టింది.తాను సాయినాథ్ రెడ్డి సహాయంతో ఫేస్ బుక్ ఖాతాను తెరిచినట్టుగా  ఆ బాలిక తెలిపింది. దీంతో సాయినాథ్ రెడ్డిని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.