హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే యువకుడిని ఓ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా కర్రలతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగా బాధితున్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా మరో అమానవీయ ఘటన గురించి బయటపడింది. 

సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి కాలనీలో జిహెచ్ఎంసీ కార్మికుడు ప్రశాంత్(24)కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే గత శుక్రవారం రాత్రి ప్రశాంత్ కు అదే ప్రాంతంలో నివాసముండే మరో మతానికి చెందిన వ్యక్తి అహ్మద్ తో స్వల్ప వివాదం రేగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరిగి గొడవ జరగ్గా అక్కడున్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు. 

read more   పట్టపగలే నడిరోడ్డుపై... యువకున్ని చితకబాదిన గ్యాంగ్ (వీడియో)

అయితే అహ్మద్ కోపంతో ఊగిపోతూనే ఇంటికి చేరుకుని గొడవ గురించి కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలిపాడు. దీంతో వారంతా కలిసి ప్రశాంత్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో అతడు ఇంట్లో లేడు. దీంతో అతడు ఎక్కడున్నాడో చెప్పాలంటూ అహ్మద్ తో వచ్చిన మహిళలు గర్భవతి అయిన ప్రశాంత్ వదిన సలోమిని చితకబాదారు. 

ఈ గొడవ గురించి తెలుసుకున్న ప్రశాంత్ ఆ రాత్రి ఇంటికి రాకుండా స్నేహితుడి వద్ద ఉండిపోయాడు. మరుసటి రోజు అతడు ఇంటికి రావడంతో రాజీ చేసుకుందామని పిలిపించుకుని అహ్మద్ తో పాటు అతడి కుటుంబసభ్యులు కర్రలతో చితకబాదారు. ఈ దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదికాస్తా వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితున్ని గుర్తించి అతడితో పాటు వదినను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం వారి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.