మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. డెంగీబారిన పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 70 ఏళ్లు వృద్ధురాలు నుంచి ఐదేళ్ల చిన్నారిని ఇలా మూడుతరాలకు చెందిన నలుగురిని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీశ్రీ నగర్ నగర్ కు చెందిన గుడిమెల్ల రాజు కుటుంబం డెంగీ మహమ్మారి కబలించడంతో 15 రోజుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

మంచిర్యాల శ్రీశ్రీనగర్ కు చెందిన గుడిమెల్ల రాజు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గుడిమెల్ల రాజుకు భార్య సోనా, కుమార్తె ఐదేళ్ల శ్రీవర్షిణి ఉన్నారు. ఇకపోతే సోనా నిండు గర్భిణి. 

కొద్దిరోజులుగా డెంగీతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడ మెురుగవ్వకపోవడంతో కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈనెల 16న ప్రాణాలు కోల్పోయాడు.  

గుడిమెల్ల రాజుకు చనిపోవడంతో ఐదోరోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అతని తాత గుడిమెల్ల లింగయ్య అదేరోజు ప్రాణాలు కోల్పోయాడు. గుడిమెల్ల లింగయ్య చనిపోయిన ఐదు రోజులుకు గుడిమెల్ల రాజు సోనా దంపతుల కుమార్తె ఐదేళ్ల శ్రీవర్షిణి ప్రాణాలను సైతం డెంగీ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 

ఒకవైపు కట్టుకున్న భర్త, మరోవైపు కుమార్తె, తాతయ్య ఇలా కళ్లెదుటే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గుడిమెల్ల రాజు భార్య సోనా నిండుగర్భిణి. ఆమె కూడా డెంగీ బారిన పడటంతో ఆమెను కరీనంగర్ నుంచి సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. 

యశోద ఆస్పత్రిలో మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సోనా అనంతరం మృతి చెందింది. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 15 రోజుల వ్యవధిలో నలుగురు డెంగీ బారినపడి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సరిగ్గా కళ్లు కూడా తెరవని పసికందు ఏడుపు చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

ఇకపోతే డెంగ్యూ మహమ్మారిన పడి ఒకే కుటుంబానికి చెందిన గుడిమెల్ల రాజు, అతని భార్య సోనా, కుమార్తె శ్రీవర్షిణి, తాతయ్య లింగయ్యలు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఇకపోతే ముక్కుపచ్చలారని పసికందును చూసి అంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.