హైదరాబాద్: రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్... తన మంత్రివర్గంలోని మంత్రుల కార్యాలయాల్లో  సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. 

మంత్రుల కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న పీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్  భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మంత్రుల వద్ద పీఎస్‌‌లుగా కేసీఆర్‌ నియామకం చేయనున్నారని సమాచారం.

ఆయా శాఖల కీలక నిర్ణయాల్లో మంత్రుల పేషీల్లోని పీఎస్‌లు కీలకంగా వ్యవహరిస్తారు. పీఎస్‌ల కారణంగానే  గతంలో కొందరు మంత్రులు అభాసు పాలైనట్టుగా ప్రచారం సాగింది. దరిమిలా మంత్రులకు పీఎస్‌లను  కేసీఆర్ నియమించనున్నారని సమాచారం.

గత టర్మ్‌లో కొందరు పీఆర్ఓలు, పీఎస్‌లపై ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది.తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొందరు జర్నలిస్టులు ఎంపీ సంతోష్‌కుమార్‌ను తమను పీఆర్ఓలుగా నియమించే విషయమై పరిశీలించాలని కోరినట్టు సమాచారం.

ఎంపీ సంతోష్‌కుమార్‌ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సంతోష్‌కుమార్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.అయితే మంత్రుల వద్ద పీఆర్‌ఓలు అవసరం లేదని సీఎం కేసీఆర్ సంతోష్‌కుమార్‌కు చెప్పినట్టు సమాచారం.  ప్రస్తుతం ఉన్న  పీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేయాలని కూడ కేసీఆర్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

ఎవరైనా మంత్రి తన కార్యాలయంలో పీఆర్‌ఓ కావాలనుకొంటే సమాచార శాఖ మంత్రిత్వశాఖను కోరాలని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఆయా మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న పీఆర్‌ఓలకు నెలకు రూ.40వేల నుండి రూ.70వేలు చెల్లిస్తున్నారు.

మంత్రులు పీఎస్‌లుగా ఎవరిని నియమించుకోకూడదని సీఎంఓ నుండి మంత్రులకు సమాచారం అందినట్టు చెబుతున్నారు. అయితే ఆయా మంత్రులకు ఎవరిని పీఎస్‌లుగా ఎవరు పనికొస్తారు, వారికి ఆయా సబ్జెక్టులపై ఉన్న అవగాహన తదితర అంశాలను సీఎంఓ పరిశీలించనుంది.  సీఎం కార్యాలయం నుండి సూచించిన వారినే మంత్రులకు పీఎస్‌లుగా నియమించే అవకాశం ఉంది.