ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైన 13 రోజులు కావస్తోంది. అయినప్పటికీ... ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఇల్లు ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

ఇప్పటికే సమ్మె మొదలుపెట్టి 13 రోజులు కావస్తోంది. బస్సులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడా తమ ఉద్యోగాల విషయంలో కంగారుపడిపోతున్నారు. ఇప్పటికే ఒక డ్రైవర్, ఒక కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా... సమ్మె విరమింపచేసేందుకు కేశవరావు లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారు.

కాగా... సమ్మెలో భాగంగా... ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈనెల 19న టీఎస్ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు జాతీయయూనియన్లు సైతం సంఘీభావం ప్రకటించాయి. జాతీయ యూనియన్లతోపాటు తెలంగాణ ఎంప్లాయిస్ అసోషియేషన్ సైతం సమ్మెకు, సమ్మెతోపాటు బంద్ కు కూడా సంఘీభావం ప్రకటించాయి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్‌, అన్‌ భజిగన్‌ తోపాటు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటించారు. 

బుధవారం హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేకే దివాకరన్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. 
ఈ నెల 19న తెలంగాణ బంద్‌ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంద్‌తో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా కేకే దివాకరన్ కు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. 12వరోజు సమ్మె ఉధృతంగా సాగుతోందని కార్మికులు అధైర్యపడొద్దన్నారు. ప్రభుత్వం వేసే వలలో ఎవరు అధైర్యపడొద్దని అశ్వత్థామరెడ్డి సూచించారు. 

మరోవైపు ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌ లిబర్టీలోని టీఈఏ కార్యాలయంలో ఆర్జీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

ఆర్టీసీ జేఏసీ నేతల విజ్ఞప్తి మేరకు సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోషియేషన్ మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి తెలిపారు. సమ్మెలో భాగంగా ఇద్దరు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం తమను కలచివేసిందన్నారు.ఆత్మహత్యలతో కాకుండా పోరాటాలతో హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.