హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే తన పంతాన్ని నెగ్గించే దిశగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ తరహాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు వాలంటరీ రిటైర్ మెంట్ ఆఫర్ ఇస్తారని అంటున్ారు. 

హైకోర్టు 50 శాతం ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. కేసీఆర్ 5,100 రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనున్నారు. ఆ రూట్లను ప్రైవేటీకరిస్తే ప్రస్తుతం ఉన్న 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో సగం మందికి పని ఉండదు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరగానే వీఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించాలని కేసీఆర్ ఆలోచిస్తున్ారు. లేబర్ కోర్టు తీర్పు తర్వాతనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. లేబర్ కోర్టు తీర్పు తర్వాత కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా, లేదా అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. 

కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. లేబర్ కోర్టు సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే కేసీఆర్ ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం టీఆస్ఆర్టీసీకి 10,460 బస్సులున్నాయి. వీటిలో 2,103 ప్రైవేట్ బస్సులు. 2,609 ఆర్టీసీ బస్సులు కండెమ్డ్ స్థితిలో ఉన్నాయి. ఈ బస్సుల స్థానంలో కొత్త బస్సులను చేర్చడానికి ఆర్టీసీ సిద్ధంగా లేదు. 

వీఆర్ఎస్ ప్రకటిస్తే ప్రభుత్వంపై పడే భారాన్ని అంచనా వేసే పనిలో అధికారులున్నారు. అయితే, ఎంత మంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు వస్తారనేది తెలియదు. కార్మికులు వీఆర్ఎస్ తీసుకోకపోతే ఆర్టీసీ వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. చాలా కాలం క్రితమే ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ఆపేసింది.  

యేటా దాదాపు 4 వేల మంది రిటైర్ అవుతూ వస్తున్నారు. ఆ రకంగా చూస్తే యాభై శాతం కార్మికులు బయటకు వెళ్లడానికి ఆరేళ్ల కాలం పడుతుంది.