హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై సంస్థ యాజమాన్యం చేతులెత్తేసింది. ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలు జరపలేమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై ఈ నెల 18వ తేదీన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ శనివారం తుది అఫిడవిట్ దాఖలు చేశారు. కార్మికుల ఆర్థిక డిమాండ్లను పరిష్కరించలేమని చెప్పారు.

ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని ఆయన హైకోర్టును కోరారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, అందువల్ల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీసీని నష్టపరిచేందుకు యూనియన్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఆర్టీసీ కార్మికుల ఆర్థిక డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తన తుది అఫిడవిట్ లో స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ ను ప్రస్తుతానికి కార్మిక నేతలు పక్కన పెట్టినప్పటికీ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చునని ఆయన అన్నారు. 

ఆర్టీసీ పూర్తి స్థాయిలో నిష్టాల్లో కూరుకుపోయిందని, సమ్మె కారణంగా ఆర్టీసీ ఇప్పటి వరకు 44 శాతం నష్టాల్లో పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం పట్ల కుట్రపూరితంగా వ్యవహరించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.