హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి సమ్మెపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గానీ ప్రైవేటీకరిస్తామని గానీ తాము ఏ రోజు కూడా చెప్పలేదని ఆయన అన్నారు. 

సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాక ముందే ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని అజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చెడు పేరు తేవాలనే ఉద్దేశంతోనే పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజల కోణం నుంచి ఆలోచించకుండా రాజకీయం చేస్తున్నాయని, ప్రజలు ప్రతిపక్షాలను ఈసడించుకుంటున్నాయని ఆయన అన్నారు. 

టెంట్ వేసిన ప్రతిచోటా ప్రతిపక్షాలు వాలిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కర్రు కాల్చి వాతపెట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని అన్నారు. 2014 బ్యాలెన్స్ షీట్ లో ఆర్టీసి ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు ఉందని చెబుతూ టీడీపీ, కాంగ్రెసు ప్రభుత్వాల హయాంల్లోనే ఆర్టీసికి నష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. 

కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే 14 కోట్ల లాభం వచ్చిందని చెప్పారు. ఐదేళ్లలో ఆర్టీసికి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఆర్టీసికి కొత్త రూపం ఇస్తామని ఆయన చెప్పారు. కాగా, ఆర్టీసి కార్మికుల సమ్మె శనివారం కూడా కొనసాగుతోంది.