హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయానికి చేరుకున్నారు.

చర్చలకు ఆహ్వానించడంతో వివిధ యూనియన్లకు చెందిన మెుత్తం 16 మంది నేతలు ఆర్ అండ్ బీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చర్చలకు నలుగురు మాత్రమే రావాలంటూ అధికారులు ఆంక్షలు పెట్టింది. 

దాంతో ఆర్టీసీ యూనియన్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ నేతలందరినీ చర్చలకు ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశిస్తే నలుగురినే చర్చలకు ఆహ్వానించడంపై టీజేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్చలకు యూనియన్ నేతలు అందరినీ ఆహ్వానించాలని అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు యూనియన్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పదు అంటే తామంతా చర్చించుకుని వస్తామని ఆర్టీసీ యాజమాన్యానికి తెగేసి చెప్పారట. 

అయితే ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నలుగురు మాత్రమే చర్చలకు రావాలంటూ ఆర్టీసీ యాజమాన్యం చెప్పడంతో చివరికి యూనియన్ నేతలు తలొగ్గక తప్పలేదు. 

ఆర్టీసీ యూనియన్ల తరపున నలుగురు చర్చలకు వెళ్లారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావుతోపాటు వాసుదేవరావు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. 

మిగిలిన యూనియన్ నేతలు బయటకు వచ్చేశారు. అయితే ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు సఫలీకృతమవుతాయా....? ప్రజలు పడుతున్న కష్లాలకు ఇక ముగింపు పలకనుందా అనేది  తెలియాలంటే మరికాసేపు వేయిట్ చేయాల్సిందే.