సంగారెడ్డి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండుపై కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ విషయం తనకు చెప్పి వుంటే కచ్చితంగా ఆర్టీసీ ప్రబుత్వంలో విలీనమై ఉండేదని ఆయన అన్నారు. 

ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని అన్ని వర్గాల ప్రజలు కూడా అనుకున్నరని, కానీ దానికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఇంత దారుణమైన, అన్యాయమైన పరిస్థితులు ఉంటాయని ఊహించలేదని ఆయన అన్నారు. 

తెలంగాణ ఏర్పడిన సుదీర్ఘంగా నడుస్తున్న ఉద్యమం ఆర్టీసీ సమ్మె అని, రోజురోజుకూ ప్రజలు, కార్మికులు, ఉద్యోగ సంఘాల మద్దతు పెరుగుతున్నా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఓ పక్క హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా ప్రభుత్వం మౌనం వహించడం ఒంటెత్తు పోకడలకు నిదర్శనమని ఆయన అన్నారు. 

ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకిరీ చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో గొంతు విప్పే అవకాశం కూడా లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని, పోలీసులతో ఉద్యమాన్ని అణిచేస్తూ ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. 

తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి ప్రభుత్వాలు కేసీఆర్ మాదిరిగానే పోలీసులను ప్రయోగించి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు తన అండదండలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.