ఖమ్మం: తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఒక ఉద్యోగి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకునేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో మనస్థాపానికి గురైన డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా రాపర్తినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. సుమారు 90 శాతం కాలిపోయాడు. 
తీవ్రంగా గాయపడ్డ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఒక ఉద్యోగి భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అని కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇకపోతే సమ్మె నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల వల్ల ఆర్టీసీ కార్మికులు మానసికంగా కృంగిపోతున్నారని ఆర్టీసీ జేఏసీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఆర్టీసీ కార్మికులను కోల్పోయినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కార్మికులు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు.