హైదరాబాద్: దసరా సెలవుల పొడగింపు విషయమై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దసరా సెలవులను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 

ఈ నెల 21వ తేదీ నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. విద్యార్థుల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా సెలవులను పొడగించాలని నిర్ణయం తీసుకుంది. 

సెలవులను పొడగించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే విద్యాశాఖ, ఇంటర్ బోర్డు స్పష్టం చేసాయి.  ఇదిలా ఉండగా, రేపటినుండి యధావిధిగా పాఠశాలలు, కళాశాలలు నడుస్తాయని పలు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపించాయి. 

కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలే ఇలా సెలవులను పొడగించబోమని ప్రకటించాయనుకుంటే పొరపాటే. గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు ఈ పొడగింపు వర్తించదని గురుకుల విద్యాలయాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

ఇలా ప్రభుత్వమేమో సెలవులను పొడగిస్తున్నామని చెబుతూ, ఎవరన్నా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. మరొపక్కనేమో రేపటి నుండి తరగతులు ప్రారంభమంటూ కొన్ని విద్యాసంస్థలు సందేశాలను పంపుతున్నాయి. ఇన్ని గందరగోళాల మధ్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.