ఎత్తుకొచ్చిన బస్సులో ప్రయాణికులను తిప్పుతూ... వీడెవడో మహా ముదురు దొంగలా వున్నాడే..!
దొంగిలించిన ఆర్టిసి అద్దె బస్సులో ప్రయాణికులను తరలించాడో కిలాడీ దొంగ. ఈ ఆశ్చర్చకర ఘటన సిద్దిపేటలో వెలుగుచూసింది.

సిరిసిల్ల : బస్సును దొంగలించడమే కాదు ధర్జాగా బస్టాండ్ లోకి వెళ్ళి ప్రయాణికులకు ఎక్కించుకున్నాడో ఘరానా దొంగ. ఇలా సొంత బస్సులా సిద్దిపేట, వేములవాడ, సిరిసిల్లా మధ్య ట్రిప్పులు వేస్తూ ప్రయాణికుల నుండి డబ్బులు వసూలుచేసాడు. చివరకు అతడి తీరుపై అనుమానం రావడంతో ప్రయాణికులు నిలదీయగా ఎక్కడ దొంగతనం విషయం బయటపడుతుందోనని భయపడి పరారయ్యాడు. ఈ వింత దొంగతనం సిద్దిపేటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సిద్దిపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ఆర్టిసి అద్దె బస్సు దొంగతనానికి గురయ్యింది. దొంగిలించిన బస్సును తీసుకుని తీసుకుని దర్జాగా సిరిసిల్ల, వేములవాడ బస్టాండ్ లోకి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు కేటుగాడు. ఆర్టిసి అధికారులకు అనుమానం రాకుండా రెగ్యులర్ డ్రైవర్ లా నటించాడు సదరు దొంగ. దీంతో వారి కళ్లముందే దొంగిలించిన బస్సులో ప్రయాణికులను తిప్పుతూ డబ్బులు వసూలు చేసాడు.
అయితే ప్రయాణికులకు అనుమానం వచ్చి నిలదీయగా డ్రైవింగ్ చేస్తున్న దొంగ ఒక్కసారిగా బస్సు నిలిపివేసాడు. ప్రయాణికుల నుండి తప్పించుకుని సిరిసిల్ల, సిద్దిపేట మధ్యలో వదిలేసి పరారయ్యాడు. వెంటనే ప్రయాణికులు ఆర్టిసి అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని బస్సును పరిశీలించి ఇది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దొంగ ప్రయాణికులను తరలిస్తున్నట్లు తెలిసి అందరూ అవాక్కయ్యారు.
Read More చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
అద్దెబస్సు దొంగతనంపై ఆర్టిసి అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ తో పాటు సిగ్నల్స్ వద్దగల సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.దొంగతనం చేసిన బస్సులో ప్రయాణికులను తిప్పుతూ డబ్బులు వసూలుచేసిన దొంగతెలివి గురించి తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.