హైదరాబాద్:ఆర్టీసీ జేఎసి నేతలు ఆదివారం నాడు  టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ నెల 5వ తేదీ నుండి  ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెకు పలు పార్టీలు, ప్రజా సంఘాల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే  ఆదివారం నాడు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో ఆర్టీసీ జేఎసీ నేతలు సమావేశమయ్యారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు తమ సమ్మెకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 5వ తేదీన ప్రకటించారు. తమ  భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి తమకు  మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఎసీ నేతలు కోరారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు ఇతర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే ఈ డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకులను తమ గమ్యస్థానాలను చేర్చుతోంది.

అయితే ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.